హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు జనాలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాబోయే రెండు రోజుల పాటు నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం మధ్యాహ్నం వరకు ఎల్బీనగర్లో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. అత్యల్పంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని మౌలాఅలీలో 23.08 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రాబోయే నాలుగు రోజుల పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగతో పాటు వాటర్ మెలన్ తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు.