మాదాపూర్, మార్చి 8: డబ్బున్న వారికి చదువు ఆభరణమని, పేదవారికి చదువు ఆయుధం వంటిదని తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వైఆర్ శ్యామల అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్లో శనివారం డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వై ఆర్ శ్యామల విచ్చేసి హైదర్ నగర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకురాలు జోషి అరుణశ్రీ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డబ్బున్న వారికి చదువు ఆభరణం వంటిదని, పేదవారికి అదే చదువు ఆయుధం లాంటిదని అని అన్నారు. ప్రతి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మాతృభాష తెలుగును మరిచిపోరాదని, తెలుగులో చదువుకున్న వారెందరో చాలా ఉన్నత స్థాయికి వెళ్లారని అన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా గౌరవించి చదివించాలని చెప్పారు.
అనంతరం హైదర్ నగర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకురాలు మాట్లాడుతూ… ప్రతి తల్లి తన బిడ్డల మీద అతి ప్రేమ చూపకుండా బాధ్యతాయుతంగా చదువుకునే విధంగా చూడాలని అన్నారు. ప్రతి పేద విద్యార్థి చదువుకుంటే భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని వాటిని ఉపయోగించుకోవడానికి సాధ్యపడుతుందన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వై ఆర్ శ్యామల, అరుణ శ్రీలతోపాటు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, కళ్యాణి, పద్మావతి, గొర్రెపాటి వివేక్, జయలక్ష్మి తదితరులు ఉన్నారు.