సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో టాస్క్‌ఫోర్స్ (ఫుడ్ విభాగం) బృందం తనిఖీలు నిర్వహించింది. విశ్వ విద్యాలయ ప్రాంగణంలోని శ్రీ సాయి గణేశ్ క్యాటర్స్ (క్యాంటీన్)ను పరిశీలించింది. స్టోర్ రూంలో ఎలుకల మలం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించింది. లేబుల్ చేయని 90 కిలోల పిండి పదార్థాలను సీజ్ చేశారు. ఫుడ్ తయారీ ప్రాంతం, డైనింగ్ ఏరియాలో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లు తేల్చారు. గ్రేవీ కూరలకు ఉపయోగించే సీతాఫలం గింజలు పురుగులు పడినట్లు గుర్తించి, 20 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన 30 కిలోల పప్పును సీజ్ చేశారు. సంబంధిత క్యాంటీన్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.