రవీంద్రభారతి,మార్చి 12 : నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం మహిళా దినోత్సవం ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సునీతాలక్ష్మారెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్త విచ్చేశారు. అనంతరం పలువురు కళాకారులకు, సామాజిక సేవకులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ లయన్ రమణారావు దేశ సంస్కృతి, సంప్రదాయాలతో వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు.
నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఏ దేశంలో మహిళలు అభివృద్ధి చెందుతారో ఆ దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతకు పెద్దపీట వేశారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మహిళలకు ఉగాది పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన భారత్ ఆర్ట్స్, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు పలువురు కళాకారులకు పురస్కారాలతోపాటు, ఘనంగా సన్మానించారు. అనంతరం రెండు తెలుగు రాష్ర్టాల కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, భవానీ, కవిత, పురుషోత్తం,లలితాదేవి, సంస్థ కార్యదర్శి లలితారావు తదితరులు పాల్గొన్నారు.