రంగారెడ్డి / మేడ్చల్, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, గ్రామీణాభివృద్ధి, మెప్మా అధికారులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశాపుహాల్లో కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులతో కలిసి మంత్రి మల్లారెడ్డి వేర్వేరుగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు.
ఈ వేడుకల్లో భాగంగా 16న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ, భారీ ర్యాలీలు నిర్వహిస్తారని, తదనంతరం బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను వక్తలు వివరిస్తారని వెల్లడించారు. 17న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-10లో రూ.53 కోట్ల వ్యయంతో రెండెకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొమురం భీమ్ భవనం, సేవాలాల్ బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. సీఎం బహిరంగ సభకు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎస్టీలను బస్సుల ద్వారా తరలించాలని సూచించారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇదిలా ఉంటే మేడ్చల్ జిల్లాలో 16న జరిగే ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ పాల్గొంటారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సమావేశాలల్లో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, మున్సిపల్ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, కావ్య, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, మేడ్చల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణీ పద్మజారాణి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 17న జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించనున్నారు.
వజ్రోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ హరీశ్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు వివరించారు.