హైదరాబాద్ : ఢిల్లీలో రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా(Delhi floods) సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని(Tania Soni) అనే(25) ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి(Kishan reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు.
ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచే యడంలో చొరవ తీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కిషన్ రెడ్డి ఆదేశించారు. కాగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఢిల్లీ ప్రజలు అతలా కుత లం అవుతున్నారు. అయితే భారీ వర్షాలకు ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు చేరింది. బేస్మెంట్లోని లైబ్రరీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచెత్తింది. దీంతో ఎటూ వెళ్లలేని స్థితిలో విద్యార్థులు తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) నీట మునిగి మృతిచెందారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మరికొంతమంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. దీనిపై 24గంటల్లో నివేదిక ఇవ్వాలని దిల్లీ మంత్రి అతిశీ రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.