శంషాబాద్ రూరల్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసిందని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ గుర్తు చేశారు. శుక్రవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. కేవలం అధికార దాహంతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న ఏడాదిలోనే రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ దీక్షతోనే దిగివచ్చిన కేంద్రం
-ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తూ. గెజిట్ విడుదల చేసింది.