సిటీబ్యూరో, జూన్ 26 ( నమస్తే తెలంగాణ)/ అడ్డగుట్ట : తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా పబ్లిక్ పాలసీస్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ ఇన్ ఇండియా, లెసెన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్” అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నూతన పాలసీల ద్వారా ఎన్నో కులవృత్తుల దారులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. బస్తీ దవాఖానలతో ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నదని, అదేవిధంగా ఆరోగ్య శ్రీ, 108 సేవలను విజయవంతంగా కొనసాగిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతున్నదని పేర్కొన్నారు.
మహిళా రక్షణ కోసం షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేశామని, వైద్యరంగాన్ని బలోపేతం చేయడం కోసం తెలంగాణలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయానికి సరిపడ నీరు, విద్యుత్ సరఫరా లేక రైతులు ఆత్మహత్యలు చేసుకొనే వారని, కానీ ఇప్పుడు పుష్కలమైన నీటి వసతి కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3లక్షల సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. మేధావులు, రాజనీతిజ్ఞులు ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చునని తెలిపారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ ఈ సెమినార్లో భాగంగా దేశంలో వచ్చిన పబ్లిక్ పాలసీలతో పాటు తెలంగాణలో వచ్చిన మార్పులు, విధానాలపై చర్చించనున్నట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే సెమినార్లో ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, సోషల్ వెల్ఫేర్ స్కీమ్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ఎస్ఆర్ సభ్య కార్యదర్శి, న్యూఢిల్లీ ప్రొఫెసర్ ధనుంజయ్ సింగ్, ఐసీఎస్ఎస్ఆర్ సంచాలకుడు ప్రొఫెసర్ బి.సుధాకర్, ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి, వివిధ ఫ్యాకల్టీల డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాల్స్, సభ్యులు పాల్గొన్నారు.