సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల నుంచే ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు రూపొందించిన ఆవిష్కరణలను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నామన్నారు.
అందులో భాగంగా జనవరి 26న 20 జిల్లాల పరిధిలోని 44 మంది గ్రామీణ ఆవిష్కర్తలకు ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులను అందజేసినట్లు చెప్పారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇన్నోవేటర్గా గుర్తించిన వారికి ఆయా గ్రామాల్లోనే అవార్డుల ప్రదానం చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు పొందిన జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్ధిపేట, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఉన్నాయని తెలిపారు.