సిటీ బ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ల్యాండ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, భూ సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం చేస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీఎంసీ, ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని, దానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలోని అట్రాసిటీ కేసుల నష్ట పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ పోలీస్ డివిజన్ల పరిధిలో ఇప్పడి వరకు 571 కేసులు నమోదు కాగా 135 ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయని , 15 చార్జిషీట్ కేసులు ఉన్నాయని అన్నారు. పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇప్పటివరకు 210 అట్రాసిటీ కేసుల్లో రూ.2.47 కోట్ల నష్టపరిహారం అందించామని, మిగిలిన 343 కేసులకు అందించేందకు కృషి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, డీసీపీ శ్వేత, కమిషన్ సభ్యులు శంకర్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాంప్రసాద్, ఎల్లేశ్, సుదర్శన్ బాబు, గోపి, వెంకటేశ్వర్రావు, ఎన్జీవో పులి కల్పన, సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓలు సాయిరామ్, రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.