సుల్తాన్‌బజార్, అక్టోబర్ 23: తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలువడం అభినందనీయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం రెడ్‌హిల్స్ శాంతినగర్‌లోని డీఎన్ఏ, మాలిక్యులర్ బయోలాజీ ల్యాబోరేటరీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, నగర సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ (క్రైమ్స్) శిఖాగోయెల్, వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కావాలంటే నేర రహిత సమాజం ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారన్నారు. ఆయన సూచనలు, సలహాలతో రాష్ట్రంలో నేరాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడమే కాకుండా చైన్ స్నాచింగ్ కేసులు అదుపులోకి వచ్చాయని, మత ఘర్షణలు లేని రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.
దేశం మొత్తంలో 68 శాతం సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతులయ్యారన్నారు. 100కు డయల్ చేస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకొని నేరాలు జరుగకుండా చూస్తున్నారని చెప్పారు. సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ నేరాలకు పాల్పడే నిందితులను గుర్తించడంలో డీఎన్ఏ, మాలిక్యులర్ ల్యాబోరేటరీ ఎంతో కీలకమైందన్నారు. మొబైల్ సిమ్‌ను వంద ముక్కలు చేసినా.. అందులోని డేటాను తీసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అభిలాష బిష్ట్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా పాల్గొన్నారు.