High Court | సిటీబ్యూరో: గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడిపేందుకు ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు. గేటెడ్‌లో నివసించడం ప్రతిష్టాత్మకంగా ఫీలవుతారు. అటువంటి గేటెడ్‌లో అంతర్గతంగా జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై నియంత్రణ లేకుండా పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా గేటెడ్‌లో నివసించేవారు దాదాపుగా ధనికవర్గానికి చెందిన వారే కావడంతో వారిపై పోలీసులు, స్థానిక అధికారుల ప్రభావం లేకుండా పోతున్నది. ఈ విషయంలో సిటీ పోలీసులపై హైకోర్ట్ సీరియస్ అయింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని ఇందూ ఫార్చ్యూస్ ఫీల్డ్స్ విల్లాల కమ్యూనిటీలో అక్రమంగా పేకాట, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక చర్యలపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ అక్కడ నివాసముంటున్న సీహెచ్ హరిగోవింద ఖొరానారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు వెళ్లి ఏమీ జరగలేదని తేల్చి చెప్పారు.
కమ్యూనిటీలో సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల రాకపై ముందస్తు సమాచారం ఇస్తుండడంతో ఆధారాలు మాయం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇందూ ఫార్చ్యూస్ ఫీల్డ్ విల్లాలతో పాటు నగరంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితులను తీసుకొని మార్గదర్శకాలు రూపొందించాలంటూ సిటీ పోలీసు కమిషనర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. గేటెడ్ కమ్యూనిటీ జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీసు చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అక్రమ కార్యకలాపాల నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి.. ఏం చేయకూడదు అన్న అంశాలపై తగిన సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి కమ్యూనిటీతో పాటు ప్లాట్ ఓనర్లకు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాలతో పాటు అనుసరించాల్సిన చట్ట నిబంధనలు, సర్కారు ఉత్తర్వులను కూడా అందించాలని సూచించింది.
కమ్యూనిటీల నుంచి న్యూసెన్స్, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్, టీజీఎన్సీబీలకు కూడా పోలీస్ కమిషనర్ తగిన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఆయా ఠాణాల పరిధిలో సాధ్యమైతే యాప్ రూపొందించి వాటి ద్వారా ఫిర్యాదు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 22, ఇతర నిబంధనల కింద అధికారాలు ఉన్న నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లకు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కమ్యూనిటీ, ఫ్లాట్స్‌లో పబ్లిక్ న్యూసెన్స్, గేమింగ్, అనధికారికంగా మద్యం తాగడం వంటి నేరపూరిత సమస్యలుంటే అవి తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, సహకార సంఘాల చట్టం కింద పరిష్కారం కాలేవని హైకోర్టు పేర్కొంది. పార్కింగ్, పెంపుడు కుక్కలు, మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించకపోవడం, పార్టీల నిర్వహణ, డీజేల పెట్టుకోవడం, క్లబ్‌హౌస్ దుర్వినియోగం వంటి అంశాల్లో పొరుగువారిపై చర్యలు తీసుకోవాలంటూ పలు పిటిషన్లు దాఖలు అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు హైకోర్టు పేర్కొంది. ఇందూ ఫార్చ్యూస్ ఫీల్డ్స్ విల్లా కమ్యూనిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో లేని వారితో ముగ్గురు సభ్యుల సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని ఓనర్స్ అసోసియేషన్‌ను ఆదేశించింది. ఏవైనా ఫిర్యాదులు అందితే తక్షణం ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెలపాలని, ఒకవేళ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే సబ్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. క్లబ్ హౌస్ వినియోగంలో చేయాల్సినవి, చేయకూడని వాటిపై సూచనలు రూపొందించి సభ్యులకు, నివాసితులకు అసోసియేషన్ సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.