హైదరాబాద్, జనవరి 11: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. వానకాలం సీజన్‌కు సంబంధించి 68.65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాటికి రైతుల నుంచి 68.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో మూడు లక్షల టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో ఉన్నదనే అంచనాలున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొదటి నుంచీ కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం మిగిలిన ధాన్యం విషయంలో ఏ నిర్ణయం తీసుకొంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. వాస్తవానికి వానకాలంలో సీజన్లో 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్లి కోటాను పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. లక్ష్యాన్ని 15-20 లక్షల టన్నుల మేర పెంచాలని కోరారు. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం మరో 8.65 లక్షల టన్నుల కొనుగోలుకు మాత్రమే కేంద్రం అంగీకరించింది. రైతుల వద్ద ఇంకా ధాన్యం ఉన్నందున రాష్ట్ర కోటాను మరింత పెంచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది.
ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నంబర్ 2
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చెప్తున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 186 లక్షల టన్నులతో పంజాబ్ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణలో 68.70 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, తృతీయ స్థానంలో నిలిచిన ఛత్తీస్‌గఢ్‌లో 67.65 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ధాన్యం ఉత్పత్తిలో అనూహ్య రికార్డులు సాధిస్తున్న నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పడం తెలంగాణ రైతులకు అశనిపాతంలా మారింది.