DGP Jitender | బండ్లగూడ, అక్టోబర్ 5 : కొత్త చట్టాల అమలుపై అవగాహన పొందడానికి వర్క్‌షాపులు ఎంతో దోహదపడతాయని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్ అన్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలుపై తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టాలు జూలై1 నుంచి అమలులోకి వచ్చాయన్నారు. గడిచిన మూడు నెలలుగా కొత్త చట్టాల పురోగతిని సమీక్షించడం, సవాళ్లను గుర్తించడం కోసం ఒక్క రోజు వర్క్‌షాపును నిర్వహించామన్నారు.
అనంతరం పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ మాట్లాడుతూ.. తరచుగా ఇలాంటి వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా చట్టాలపై అవగాహన పెరుగుతుందన్నారు. చట్టాన్ని అమలు చేయడంలో న్యాయకత్వ పాత్ర, కొత్త చట్టాలు సంక్లిష్టంగా ఉంటాయని, వాటికి తగిన శిక్షణ లేకుండా అమలు చేయడం సవాలుగా ఉంటుందన్నారు.
నూతన చట్టాల అమలులో తమ బృందాలకు సమర్థవంతమైన మార్గనిర్దేశం చేసేందుకు మంచి నిర్వాహకులు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడీ శిఖా గోయల్, రాజస్థాన్ మాజీ డీజీపీ డీసీ జైన్, డీజీపీ ఇంటెలిజెన్స్ శివధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌జైన్, స్టిఫెన్ రవీంద్ర, అవినాష్ మహంతి, తరుణ్‌జోషి, తదితర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.