కొండాపూర్, అక్టోబర్ 7 : టెక్నాలజీ మానవాళికి సేవ చేసేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చీఫ్ రెక్టార్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవ వేడుకలు మంగళవారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాంతిసరోవర్‌లో ఉన్న గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిష్ణా ఎల్లాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఏడాది 1717 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు ప్రకటించగా, అందులో 990 మంది పట్టాలు అందుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మానవుడి అంతిమ లక్ష్యం మేధస్సును పెంచడమే కావాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు. పట్టాలు అందుకున్న గ్రాడ్యుయేట్లు ఇతరులకు అవకాశాలు సృష్టించే విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
క్రిష్ణ ఎల్లా మాట్లాడుతూ.. భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే యువత ఆవిష్కరణలు, నైపుణ్యం మీద దృష్టి సారించాలన్నారు. నేటి విద్యార్థులు ఉద్యోగ అన్వేషకులుగా మారుతున్నారనీ, ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దృష్టి లోపాన్ని అధిగమించి ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పట్టా అందుకున్న విద్యార్థిని గోపి తేజస్వీకి ఓబీసీ కేటగిరి గోల్డ్‌మెడల్‌ను అంజేశారు. జంతు, జీవ శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందిన కాశ్మీరీ విద్యార్థి డాక్టర్ మహమ్మద్ సుల్తాన్ ఖాన్‌కు ప్రొఫెసర్ ఏనుగు రామస్వామి నాయుడు పథకాన్ని అందజేశారు. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు తదితరులు పాల్గొన్నారు.