సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బస్సుల్లో చిల్లర సమస్యలను పరిష్కరించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్, కార్డు స్వైపింగ్ అందించే ఇంటలిజెంట్ టికెటింగ్ (ఐటిమ్) మిషన్ల సేవలపై విమర్శలు వస్తున్నాయి. టికెట్ తీసుకోవడంలో చిల్లర సమస్య ఉండకూడదని డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి బస్సుల్లో ఐటిమ్ మిషన్లను ఏర్పాటు చేశారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఇవి పనిచేయడం లేదు.
మరోవైపు కండక్టర్లకు టిమ్ మిషన్ల చెల్లింపులు కష్టతరంగా మారడంతో డిజిటల్ చెల్లింపుల సేవలు లేవని ప్రయాణికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చిల్లర లేదని ప్రయాణికులు చెబితే బస్సు దిగాలని వేధిస్తున్నారు. ఇలాంటి తరహా ఫిర్యాదులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు వెల్లువెత్తుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మినహాయిస్తే మిగిలిన 40 శాతం ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులకు ఆసక్తి చూపిస్తున్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
కానీ అందుకు అనుగుణంగా సేవలు మాత్రం అందించడంలో విఫలమవుతున్నారు. డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు సిద్ధంగా ఉన్నా సర్వర్ పనిచేయడం లేదంటూ నగదు ఇవ్వాలని కండక్లర్లు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్లోని 25 డిపోలకు ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా 6 వేల ఐటిమ్స్ మిషన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో వివరాలు ఎంటర్ చేస్తే నేరుగా చార్జీ ధర చూపిస్తూ క్యూఆర్ కోడ్ వస్తుంది. దానిని స్కాన్ చేసి యూపీఐ చెల్లింపు చేసి టికెట్ పొందొచ్చు. అయితే ఇలాంటి తరహా విధానాన్ని కండక్టర్లు ముందుకు తీసుకుపోవడం లేదు.