సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): అనధికారిక నిర్మాణాలపై హెచ్ఎండీఏ టాస్క్ఫోర్స్ దూకుడు పెంచింది. ఎలాంటి అనుమతులు లేని నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కూల్చివేస్తున్నది. టాస్ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో 133 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బుధవారం మూడు మున్సిపాలిటీల పరిధిలో 11 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు. నాగారం మున్సిపాలిటీలో ఏడు, నార్సింగి మున్సిపాలిటీలో మూడు, మణికొండ మున్సిపాలిటీలో ఒకటి చొప్పున కూల్చివేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో గ్రామపంచాయతీ పర్మిషన్ సిల్ట్ ప్లస్ రెండు అంతస్తుల కోసం( సిల్ట్ +2) అనుమతులు పొంది సిల్ట్ ప్లస్ ఐదు అంతస్తులు (slit+5) లతో పాటు పైన పెంట్ హౌస్ నిర్మాణాలు చేసిన మూడు (3) నిర్మాణాలపై టాస్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో అక్రమంగా నిర్మించిన ఒక షెడ్డును అధికారులు కూల్చివేశారు.