సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఇసుకు మాఫియాపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమంగా ఇసుక అమ్ముకునేవారు ఇతర ప్రాంతాలకువెళ్లి అక్కడ ఇసుక బుక్ చేసి హైదరాబాద్‌లో డంప్ చేస్తున్నారు. ఇసుక రీచ్‌నుంచి పదివేలకు కొని హైదరాబాద్‌లో 50వేలకు అమ్ముతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సిటీలోని పలుచోట్ల ఇసుకడంపులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పరిధిలోని తుకారాంగేట్, బోయిన్పల్లి, త్రిముల్ఘరీ, బేగంపేట, సికింద్రాబాద్‌లలో 889 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పరిధిలోని మధురానగర్‌లోని జానకమ్మతోట, యూసుఫ్‌గూడలలో 143టన్నులు, సెంట్రల్‌జోన్ పరిధిలోని ముషీరాబాద్, గాంధీనగర్, దోమలగూడలలో 66 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డిసిపి సుధీంద్ర తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డంపులపై టాస్క్‌ఫోర్స్, రెవెన్యూ అధికారులు కలిసి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ వరకు ఇసుక తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో మొత్తం రూ.58.72లక్షల ఇసుక స్వాధీనం చేసుకోగా, 9లారీలు, 5టిప్పర్లు, 8ట్రాక్టర్లు, 1వ్యాన్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.