చార్మినార్, మార్చ్ 6: డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ఓ ముఠా ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జ్యోతి(49), సునీల్ సింగ్ (43), జి.రమేశ్(43), నితిన్ కుమార్( 23) మండల కార్యాలయాల్లో కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలను ఇప్పించే ఏజెంట్లుగా పనిచేసేవారు.
ఈ క్రమంలో అనేకమందితో ఏర్పడిన పరిచయాన్ని సొమ్ముగా మార్చే క్రమంలో నిందితులు డబుల్ బెడ్ రూం ఇప్పిస్తామంటూ 200 మంది వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 20వేల వరకు వసూలు చేశారు. రెండేళ్ల నుంచి కొనసాగుతున్ననీ వ్యవహారంలో ..ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది నకిలీ అలాట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు.
ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకుతిరుగుతున్నారు. డబ్బులు వసూలు చేసి ఇన్నాళ్లైనా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛత్రినాక పోలీసులతో కలిసి నిందితుల ఇళ్లపై దాడులు కొనసాగించారు. ప్రధాన నిందితురాలు జ్యోతి తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి లక్ష రూపాయల నగదు తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ఆర్డీఓ కార్యాలయానికి చెందిన రబ్బర్ స్టాంపులు, లాప్ టాప్ కలర్ ప్రింటర్, వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ లో మంజూరు అయినట్లు చూపించే 200 నకిలీ అలాట్మెంట్ లెటర్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.ఈ సమావేశంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఛత్రినాక పీఎస్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్ వర్మ, ఎస్ఐలు మల్లేశ్, కె.నర్సింహులు, జి.ఆంజనేయులు, ఎన్.నవీన్ తదితరులు పాల్గొన్నారు.