నగరంలో అసలే ఎండలు మండిపోతున్నాయి.. తాగునీటికి జనం తండ్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విలువైన తాగునీరు పక్కదారి పడుతున్నది. గృహావసరాలకు వినియోగించాల్సిన నీటిని విచ్చలవిడిగా భవన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. జలమండలి నీటిని తాగడానికి.. గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తిస్తే జరిమానాలు విధిస్తామంటూ.. నిత్యం ప్రకటనలు గుప్పించే అధికారులు.. ఇలా క్షేత్రస్థాయిలో తాగునీరు దుర్వినియోగమవుతున్నా..దృష్టి పెట్టకపోవడం విస్మయం కలిగిస్తున్నది. నీటి కొరత రోజురోజుకు జటిలమవుతున్న నేపథ్యంలో తాగునీటి ట్యాంకర్లు ఇలా భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు నీరు తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)
‘ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో 20 శాతం ఆదా చేయాలి… నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి.. నీటిని వృథా చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జలమండలి నీటిని తాగడానికి.. గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తిస్తే జరిమానాలు విధిస్తాం.’ ఇటీవల జలమండలి అధికారులతో ఎండీ అశోక్‌రెడ్డి తాగునీటి ఆదాపై నిర్వహించిన సమీక్షలో అన్న మాటలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జలమండలి సరఫరా చేసే తాగునీరు దుర్వినియోగం అవుతున్నది. భవన నిర్మాణాలకు తాగునీటిని విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. కమర్షియల్ బుకింగ్ చేసుకున్న ట్యాంకర్లు నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. అధికారులు మాత్రం బుకింగ్ అయిందా లేదా? అని మాత్రమే చూస్తున్నారు తప్ప.. ఆ నీరు ఎక్కడికి వెళ్తున్నది? దేనికి వినియోగిస్తున్నారు? అని ఏమాత్రం ఆలోచించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటిని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన ఫీల్డ్ మేనేజర్లు, ఇతర అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా విలువైన తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిల్మ్‌నగర్-దర్గా రోడ్డులో ఓ భవన నిర్మాణానికి జలమండలి తాగునీరు సరఫరా చేస్తున్నారు. నిర్మాణ దశలోనే ఉన్న భవనానికి మంచినీళ్లను సరఫరా చేయడంపై వాటర్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. కనీస తనిఖీలు చేయకపోవడం.. తాగునీరు ఎక్కడికి వెళ్తున్నదో గమనించకపోవడం జలమండలి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నది.

జలమండలి పరిధిలో వినియోగదారులు తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానాలు విధిస్తున్నారు. బైకులు, కార్లు కడిగినా రూ.వేలల్లో జరిమానాలు విధిస్తున్నారు. కనీసం ఇంటి ఫ్లోర్ కడిగినా వదిలిపెట్టలేదు. కానీ వందలాది ట్యాంకర్ల విలువైన తాగునీరు అక్రమమార్గాల్లో దుర్వినియోగమవుతుంటే పట్టించుకోకపోవడం లేదు. తాగునీరు పక్కదారి పడుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నీటి కటకట మొదలవుతన్న నేపథ్యంలో భవన నిర్మాణాలకు నీరు తరలివెళ్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో నీటి కొరత ఏర్పడుతున్నది. మరికొన్ని ప్రాంతాల్లో బుకింగ్‌లు వందలాదిగా పేరుకుపోతున్నాయి. నీటి కొరత రోజురోజుకు జఠిలమవుతున్న నేపథ్యంలో ఇలా భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు నీరు తరలిపోతుండటంతో ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు చేపడుతూ నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.