Hyderabad | సిటీబ్యూరో, జూలై15(నమస్తే తెలంగాణ): మూడేళ్లుగా సకాలంలో వర్షాలు పడకపోవడం. ఈ ఏడాది జూలై నెల సగం గడిచినా సమృద్ధి వానలు లేకపోవడం మూలంగా చాలా ప్రాం తాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతేడాది జూలై 1 నుంచి 14 వరకు 63,724 ట్యాంకర్ల డిమాండ్ ఉండగా, ఈ సంవత్సరం జూలై 14 నాటికి 86,520 ట్యాంకర్లను వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు. గతేడాది కంటే 36 శాతం అధికంగా ఉండటం గమనార్హం. వానలు పడకుంటే నీటి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం నెలకొంది. ప్రస్తుతం జలమండలి పరిధిలో దాదాపు 1135 ట్యాంకర్లు ఉన్నాయి. వీటిద్వారా రెండు షిఫ్టులలో ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా రోజువారి బుకింగ్ అయ్యే ట్యాంకర్లలో అత్యధికంగా 6,15,9,18,22,10 డివిజన్లలోనుంచే బుకింగ్లు వస్తున్నాయి.
ఇంకుడు గుంత లేకుంటే ఇబ్బందే..!
నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం నీటి కొరతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జలమండలి పరిధిలో దాదాపు 14లక్షల కనెక్షన్లు ఉండగా, కేవలం 42 వేల గృహాలకు చెందిన వాళ్లు మాత్రమే ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారు. అందులో 500 మంది ఎండాకాలంలోని 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. 42వేల మంది 2.84లక్షల ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. దీంతో జలమండలి అధికారులు వారి గృహాల్లో సర్వే చేసి, వారికి ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. వారందరికీ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా నోటీసులు జారీ చేసి, 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలాగా అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇప్పటివరకు 16 వేల మందికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
చర్యలు తీసుకుంటున్నాం
ఓఆర్ఆర్ పరిధిలోని 300 గజాలకు పైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఇంకుడు గుంతలు లేని వారికి ట్యాంకర్ రేటు పెంచడానికి కూడా వెనుకాడం. వచ్చే నెల రోజుల్లో అలాంటి వారి జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. ట్యాంకర్ బుకింగ్లు చేసిన వారికి సకాలంలో డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
-అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ