Talasani Srinivas Yadav | సైబరాబాద్, శంషాబాద్ అనేవి ఒకప్పుడు చిన్న గ్రామాలు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాలక్రమంలో అవి విస్తరించబడ్డాయని పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ రెండేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని నిలదీశారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తూ వస్తుందని తెలిపారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని పేర్కొన్నారు.హైదరాబాద్ అభివృద్ధి మన కళ్ల ముందే జరిగిందని చెప్పారు. కానీ రెండేళ్లలో హైదరాబాద్ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని బాలం రాయిలీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేర్లు మారుస్తానని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 150 డివిజన్లను 300 డివిజన్లు చేస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రజలను, ప్రతినిధులను కలిసి దీనిపై చర్చించే అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నీ ఇష్టారాజ్యమా అని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్‌పై చట్టపరంగా కొట్లాడుదామని పిలుపునిచ్చారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తప్పుల తడకగా జరిగిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పునర్విభజన చేస్తే జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్‌కు సమాచారం కూడా ఇవ్వరా అని మండిపడ్డారు. మా ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే మీ పీఠం కదిలిపోద్ది అని హెచ్చరించారు. మనుషుల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతియాత్ర చేపడతామని పేర్కొన్నారు. అహింసా మార్గంలో మన హక్కుల కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చారు. నల్ల జెండాలతో వేలాది మందితో శాంతియాత్ర చేద్దామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్‌ను ముట్టడిస్తామని తెలిపారు. తర్వాత బంద్ పిలుపునిస్తామని చెప్పారు. రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. మొదట మన ఆత్మగౌరవం.. తర్వాతే రాజకీయమని స్పష్టంచేశారు. భేషజాల్లేకుండా పోరాటం చేస్తామని తెలిపారు. మన తండ్రి, తల్లి పేరు మారిస్తే ఊరుకుంటామా అని మండిపడ్డారు. మన ప్రాంతం పేరు మార్చడానికి వీళ్లేవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఇష్టానుసారం చేస్తానంటే నడవదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. గూగుల్ మ్యాప్‌తో డీలిమిటేషన్ చేస్తారా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో పుట్టిన ప్రతి బిడ్డ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.