Talasani | బేగంపేట్ : కళాసిగూడలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడలోని మినర్వ కాంప్లెక్స్ డౌన్లో బుధవారం వివిధశాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని, కలుషిత తాగునీటి సరఫరా జరుగుతుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా డ్రైనేజీ ఓవర్ నిండి రోడ్లపై పారుతోందని చెప్పారు.
దాంతో స్పందించిన తలసాని.. తాగునీటి పైప్లైన్ ఎక్కడ లీకేజీ ఉందో గుర్తించి.. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వీధిలైట్లు లేవని, రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. వెంటనే స్ట్రీట్లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. తలసాని వెంట డీసీ సమ్మయ్య, వాటర్ వర్క్స్ డీజీఎం శశాంక్, ఈఈ సుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మిత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, ప్రమోద్, నర్సింగ్, బీఆర్ఎస్ రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, కిషోర్, ఆంజనేయులు, ఆరీఫ్ పాల్గొన్నారు.