బేగంపేట్ జూన్ 8: మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థీవ దేహంపై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. ఆయన మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు.
సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించి తాను ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఈనాడు పత్రిక ద్వారా అనేక వాస్తవాలను వార్తల రూపంలో తీసుకువచ్చి తెలుగు ప్రజల మనసులో నిలిచిపోయారని అన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలంతా గర్వపడేలా ఎంతో అద్భుతమైన ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దిన ఘనత కూడా రామోజీరావుకు దక్కుతుందన్నారు. ప్రజాహితం, సమాజహితం కోసం కృషి చేసిన రామోజీరావు మృతి తెలుగు ప్రజలకే కాదని, దేశానికి కూడా తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, సికింద్రాబాద్ శాసన సభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు రామోజీ రావుకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రికాభాషను ఆధునీకరించడంలో రామోజీరావు చేసిన కృషి విప్లవాత్మకమైందని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యలు పేర్కొన్నారు. ఇంకా, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాండూరి క్రిష్ణమాచారిలు రామోజీ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.