ఉస్మానియా యూనివర్సిటీ : బడుగు, బలహీనవర్గాల నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుట్రను భగ్నం చేసిన పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
కుట్రకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కుట్ర చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ ఓయూ పోలీసులకు కుట్ర చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అనంతరం జైగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ మాట్లాడుతూ అరెస్టైన నిందితులెవరికి మంత్రిని హత్య చేసే అవసరం లేదని అన్నారు. వీరికి రూ.15 కోట్లు సుపారీ ఇచ్చిన హత్య చేసేందుకు ఉసిగొల్పిన వారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, డీకే అరుణ అని అనుమానం వ్యక్తం చేశారు.
తక్షణమే వారిని అరెస్టు చేసి, రాష్ట్రంలో శాంతియుత ప్రజాజీవనానికి భంగం కలుగకుండా చూడాలని కోరారు. నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, నిందితులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ కుట్ర చేశారని అభిప్రాయపడ్డారు.
కేసు తేలేవరకు జితేందర్‌రెడ్డి, డీకే అరుణను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కుట్రకు బీజేపీ పరోక్ష మద్దతు ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సూదగాని ఫౌండేషన్ చైర్మెన్ హరిశంకర్‌గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్, జై గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు శేషగాని నరేశ్‌గౌడ్, వివిధ సంఘాల నాయకులు తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మునికుంట్ల శ్రీనివాస్‌గౌడ్, కొంపల్లి వెంకటేశ్‌గౌడ్, గుండ్రాతి నారాయణగౌడ్, డాక్టర్ రఘునాథ్‌గౌడ్, బోడ వెంకటరమణ, ప్రసాద్‌గౌడ్, బొమ్మగాని శంకర్‌గౌడ్, దంతూరి శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌గౌడ్, నరేందర్‌గౌడ్, నరేశ్‌గౌడ్, సిద్ధులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.