సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ముంబై పోలీసులు ఛేదించిన భారీ డ్రగ్ నెట్‌వర్క్‌లో మాఫియా లింక్లున్నట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముంబైలో అరెస్ట్ అయిన నిందితులకు నేర చరిత్ర ఉండటం, ఈ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించిన నిందితులకు మాఫియాతో సంబంధాలు ఉండడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆగస్టు 8వ తేదీన నమోదైన ఈ డ్రగ్ కేసులోని నెట్‌వర్క్‌ను ఒక్కొక్కటిగా ఛేదిస్తూ హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ ఎత్తున డ్రగ్ తయారవుతున్నట్లు గుర్తించారు. స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి చర్లపల్లిలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారవుతున్నట్లు నిర్ధారించుకొని నిర్వాహకులు శ్రీనివాస్ విజయ్ వోలేటితో పాటు అతడికి సహకరిస్తున్న తానాజీ పండరినాథ్ పట్వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ముంబై నుంచి హైదరాబాద్‌కు…
వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ డ్రగ్స్ తయారు చేసి, వాటిని దేశంలోని పలు రాష్ర్టాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది ముంబై పోలీసులకు ఇతడు డ్రగ్స్ సరఫరా చేస్తున్న గ్యాంగ్ చిక్కింది, అందులో శ్రీనివాస్ విజయ్ కూడా నిందితుడిగా ఉన్నా తనకున్న పలుకుబడితో అరెస్ట్ నుంచి తప్పించుకొని, నోటీసులతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలోనే అప్పుడు అక్కడున్న డ్రగ్ పెడ్లర్లకు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్ సరఫరా అవుతున్న విషయాలపై అనుమానాలు వచ్చాయి.
అక్కడున్న పాత నేరస్తులు, మాఫియాలో తిరిగే వారు అప్పుడప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో గతేడాది పట్టుబడ్డ నిందితుల నెట్‌వర్క్‌పై కన్నేసిన ముంబై పోలీసులకు భారీ స్మగ్లింగ్ ముఠా చిక్కింది. గత నెల 8వ తేదీన బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా మురాద షేక్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ నెట్వర్క్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. అందులో భాగంగానే 12 మంది నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. అందులో ఫైజల్, ముస్తఫా హైదరాబాద్‌కు వచ్చి శ్రీనివాస్ విజయ్ వద్ద నుంచి డ్రగ్ తీసికెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తయారవుతున్న డ్రగ్‌ను ముంబైలోని డ్రగ్ పెడ్లర్లకు విక్రయించంలో ఫైజల్, ముస్తఫాలు కీలక పాత్ర పోషించేవారు. వీరికి తోడుగా పాత నేరస్తుడైన ముస్తఫా ఖాన్ అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవాడు.
ఈ ముగ్గురికి ముంబైలోని గల్లీ నుంచి మాఫియాలోని కీలక డాన్ల వరకు పరిచయాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వీళ్లంతా తరుచూ హైదరాబాద్‌కు వస్తూ శ్రీనివాస్ విజయ్ వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్ కొని తీసికెళ్లేవారని, బస్సులు, సొంత వాహనాల్లోనే ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారని పోలీసుల విచారణలో బయటపడింది. కొన్ని సందర్భాల్లో ముంబై నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు కొరియర్లలో పంపించేవారని, మరికొన్ని సందర్భాల్లో విజయ్ శ్రీనివాస్ నేరుగా వెళ్లి డ్రగ్ సైప్లె చేసేవాడని సమాచారం.
ముంబైలోని డ్రగ్ ముఠాల చేతికి సింథటిక్ డ్రగ్స్ కిలోల కొద్ది వెళ్లడంతో అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆ ముఠాలు సరఫరా చేసినట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో తయారైన సింథటిక్ డ్రగ్ ఎక్కడెక్కడకు సైప్లె అయ్యిందనే విషయాలపై మరింత స్పష్టత కోసం శ్రీనివాస్ విజయ్‌ని అదుపులోకి పోలీస్ కస్టడీకి తీసుకొని అతడిచ్చే సమాచారంతో ఈ నెట్‌వర్క్‌ను ముంబై పోలీసులు గుర్తించనున్నారు.