సికింద్రాబాద్, జనవరి 16: ఎంతో పురాతనమైన క్లబ్ అది. వేలాది మంది నిత్యం సేద తీరేందుకు వస్తుంటారు. బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం 1878లో నిర్మించిన ఈ క్లబ్.. నాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ.. నాలుగేండ్ల కిందట దేశ వారసత్వ సంపదగా ఖ్యాతి గడించింది. పోస్టల్ కవర్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రంగా వ్యాపించి.. క్లబ్ మొత్తం కాలిపోయింది. నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోయినా.. సుమారు రూ. 25 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు క్లబ్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షార్ట్ సర్క్యూటా, లేక మరేదైనా కుట్రనా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
పురాతన క్లబ్‌లలో సాటిలేనిది..
భారత్‌లోని పురాతనమైన క్లబ్‌లలో సికింద్రాబాద్ క్లబ్ ఒకటి. దీనికంటూ ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. మొదటిలో ఈ క్లబ్‌ను ‘సికింద్రాబాద్ పబ్లిక్ రూమ్స్’గా, ఆ తర్వాత ‘సికింద్రాబాద్ గ్యారిసన్ క్లబ్’, ‘సికింద్రాబాద్ జిమ్ఖానా క్లబ్’గా పిలిచేవారు. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వందల ఏండ్ల నాటి భారీ వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అవి క్లబ్ చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్నో రకాల పక్షులకు ఈ భారీ చెట్లు ఆతిథ్యమిస్తుంటాయి. ప్రకృతి సోయగాలు, అందాలతో ఈ క్లబ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది.
అప్పట్లో వారికే సభ్యత్వం…
స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేందుకు కేవలం బ్రిటన్ పౌరులనే అనుమతించేవారు. సభ్యులుగా అందరూ ఆ దేశ అధికారులే ఉండేవారు. హైదరాబాద్ సంస్థానానికి చెందిన కొందరు రాజులకు మాత్రమే సభ్యత్వం ఉండేది. ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సహా అన్ని రంగాలకు చెందిన 4వేలమంది శాశ్వత సభ్యులు, 30వేల మంది క్రియాశీలక సభ్యులున్నారు. క్లబ్ మేనేజింగ్ కమిటీని సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటారు.
అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు.. వంటకాలు
సికింద్రాబాద్ క్లబ్లో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్నాయి. 5స్టార్ హోటల్లో ఉండే వసతులన్నీ ఇందులో ఉంటాయి. క్రికెట్ మైదానం సహా ఇండోర్, అవుట్డోర్ క్రీడలకు సంబంధించి అన్ని సౌకర్యాలున్నాయి. ఏసీ బార్లు, డైనింగ్, బాంకెట్ హాల్స్‌తో పాటు భారీ సమావేశాలకు ఏర్పాట్లు ఉన్నాయి. సినిమాల ప్రదర్శనకు ఓపెన్ ఎయిర్ థియేటర్ , పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. కాంటినెంటల్ నుంచి మొఘల్ వరకు.. చైనీస్ నుంచి ఇటాలియన్ వరకు, ఉత్తర నుంచి దక్షిణ భారతీయ వంటకాల వరకు అనేక రకాల రుచులు నోరూరిస్తాయి. దీంతో పాటు సభ్యులు సామాజిక సమావేశాలు నిర్వహించుకోవాలంటే కావాల్సిన సౌకర్యాలను క్లబ్ కల్పిస్తుంది. అదే విధంగా దేశంలో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ కలిగి ఉన్నది ఒక సికింద్రాబాద్ క్లబ్ కావడం విశేషం. అలాగే భారత్‌తోపాటు యూఎస్ఏ, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని సుమారు వంద అగ్రశ్రేణి క్లబ్‌లతో అనుబంధంగా కొనసాగుతుండటం విశేషం.
తెల్లవారుజామున..
సికింద్రాబాద్ క్లబ్లో తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ రఘురాం రెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. క్లబ్ ముందు భాగం మొత్తం కూడా కలప, చెక్కతో కూడి ఉండటం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పారు. హెరిటేజ్ బిల్డింగ్‌తో పాటు బార్ మొత్తం ప్రమాదంలో కాలిపోయిందన్నారు. కాగా, సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదంపై మాజీ ఆర్మీ అధికారి విజయ్ స్పందించారు. మెయిన్ హాల్ పూర్తిగా కాలిపోయిందన్నారు. క్లబ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
సమాధానం లేని ప్రశ్నలు
అగ్ని ప్రమాదం జరిగిన క్లబ్‌లోని ‘కాల్ నైట్ బార్ బంగా’్లలో ఏం ఉంది? అసలేం జరిగిందనేది మిస్టరీగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా క్లబ్ మూసి ఉన్నప్పటికీ కేవలం మద్యానికి సంబంధించిన ఈ బంగ్లా తెరిచి ఉంచారని, తాము రాత్రి కూడా గెస్టులకు సర్వీస్ అందించామని, ఈ భవనంలో అప్పుడప్పుడు సభ్యులు మద్యం సేవిస్తుంటారని ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. సభ్యులకు మరోవర్గం మెంబర్లకు గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. 3 గంటల ప్రాంతంలో తమకు ఫోన్లు వచ్చాయని క్లబ్లో పనిచేసే పలువురు పేర్కొన్నారు. క్లబ్‌లోకి రాగానే సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు తీసుకున్నారని, మెయిన్ గేట్ వద్దకు చేరుకొని చూస్తుండగానే మంటలు పెద్దఎత్తున చెలరేగాయని చెప్పారు.ఇదిలా ఉండగా నిర్వాహకులు ఈ ఘటనపై బయట ఎవరితో మాట్లాడవద్దని, మీడియాకు ఏం చెప్పవద్దని ఆదేశించినట్లు సదరు సిబ్బంది వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో అసలు ఆదివారం తెల్లవారుజామున ఏం జరిగింది…? ఆ సమయంలో క్లబ్‌కు వచ్చింది ఎవరు…? అనేది తెలియాల్సి ఉంది.