Panjagutta PS | ఖైరతాబాద్, జనవరి 17: ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ అది. కాని నేడు దాని ప్రాశస్త్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు మహర్దశ పట్టింది. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించారు. అందులో భాగంగా పంజాగుట్ట పీఎస్‌కు సుమారు కోటిన్నరతో అభివృద్ధి చేసినట్లు అప్పటి అధికారులు తెలిపారు.
భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా విభాగం 2017లో ఉత్తమ పోలీసు స్టేషన్ల ఎంపిక కోసం దేశంలోని అన్ని రాష్ర్టాలకు సంబంధించిన పోలీసు స్టేషన్ల ఎంట్రీలను ఆహ్వానించగా, 140 పోలీసు స్టేషన్లు పోటీ పడ్డాయి. మౌలిక వసతులు, కేసుల విచారణ, విధులు, ఫైళ్ల నిర్వహణ, రికవరీలు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరులో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు 2018లో దేశంలోనే రెండో అత్యుత్తమ ర్యాంకు దక్కింది. అలాంటి పోలీస్ స్టేషన్ నేడు వివాదాలతో ఆదరణ కోల్పోయింది.
ఈ పీఎస్‌లో విధులు కత్తిమీద సామే..
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు ప్రస్తుత ప్రజాభవన్, కీలకమైన ప్రభుత్వ శాఖ కార్యాలయాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్, నిమ్స్ దవాఖాన, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ విధులు నిర్వహించాలంటే సిబ్బందికి కత్తిమీద సాము లాంటిదే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో నిత్యం ఆయా రూట్లలో పర్యవేక్షణలో అధికారులు నిమగ్నమవుతుంటారు. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. విధుల్లో తప్పులు జరిగితే చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా ఓ యాక్సిడెంట్ కేసులో జోక్యం చేసుకున్న పంజాగుట్ట సీఐ దుర్గారావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
20 రోజులుగా ఇన్చార్జి పర్యవేక్షణలో….
గతంలో పంజాగుట్ట పీఎస్‌లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించేందుకు పోటీ పడేవారు. గత నెల 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద కారు బారికేడ్‌ను ఢీకొట్టిన ఘటనలో సీఐ అలసత్వం ప్రదర్శించారంటూ దుర్గారావును ఉన్నతాధికారులు డిసెంబర్ 26న సస్పెండ్ చేశారు. ఈ కేసును స్వయంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణ చేపట్టారు. ఈ పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారులు ప్రత్యేక నజర్ పెట్టడంతో ఇక్కడ విధులు నిర్వహించేందుకు కొందరు అధికారులు వెనుకాడుతున్నట్లు తెలిసింది. పైరవీలకు కూడా చాన్స్ లేకుండా పోయింది. గత 20 రోజులుగా పంజాగుట్ట సీఐ చాంబర్లో కుర్చీ ఖాళీగానే ఉంది. దీంతో కేసుల దర్యాప్తు, పరిష్కారాల్లో ఇన్చార్జి అధికారిపై భారం తప్పడం లేదు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా కరువైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు అదనపు ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.