వెంగళరావునగర్, ఆగస్టు 27: వ్యభిచార గృహానికి వెళ్లిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. రక్షకభటుల రాస లీలలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సీరియస్ అయ్యారు. మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీశ్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హోంగార్డు రాజును పోలీసు శాఖకు చెందిన మోటార్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుకు తిరిగి పంపారు. ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ఈ నెల 26న ప్రచురించిన “వ్యభిచార గృహాలనూ వదలట్లే” అనే శీర్షికనపై సీపీ స్పందించారు. స్పా సెంటర్ నుంచి లంచాలు వసూలు చేయడమే కాకుండా.. అక్కడుండే యువతులతో ఆ సుఖం రుచి మరిగిన కానిస్టేబుళ్ల బాగోతాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తేవడంతో నగర పోలీసు శాఖను ఓ కుదుపు కుదిపి వేసింది.
కానిస్టేబుళ్లు కాదు.. ‘కామ’స్టేబుళ్లు
మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజినీర్స్ కాలనీలో ఉన్న రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచార గృహం గత కొంత కాలంగా గుట్టుగా సాగుతోంది. ఈ వ్యభిచార గృహానికి మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీశ్, హోంగార్డు రాజు తరచూ వెళ్తూ.. అక్కడున్న యువతులతో తమ కామ కోరికలను తీర్చుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ వ్యభిచార గృహం నుంచి ప్రతినెలా కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీశ్, హోంగార్డు రాజు మామూళ్లు కూడా వసూలు చేశారని పోలీసుల విచారణలో వ్యభిచార గృహ నిర్వాహకులు బాలరాజు, రజిత వెల్లడించారు.
రక్షక భటులా.. రాక్షస భటులా..
పొందు కోసం పరితపించిన పోలీసులు రక్షకభటులే రాక్షసభటుల్లా మారారని.. లంచాలతో పాటు అందమైన యువతుల పొందు కోసం పరితపించారని.. అంతటితో ఆగకుండా కేసులు పెడుతామంటూ బెదిరింపులకు గురిచేసి తమ వద్ద నుంచి మామూళ్లు కూడా వసూలు చేశారని నిందితులు వాపోయారు. చెప్పుకోలేని రీతిలో యువతులతో ప్రకృతికి విరుద్ధంగా తమ కామ కోరికలను ఆ ఖాకీల్లో ఒకరైన కానిస్టేబుల్ నామోదర్ దారుణంగా హింసించి తీర్చుకునేవాడని.. ఆట వస్తువుల్లా ఆడుకున్నారని దర్యాప్తులో నిందితులు వెల్లడించారు.
ఆ పోలీసుల పాపం పండింది..
పైసలు దండుకుని పాపిష్టి పనులు చేసిన ఆ పోలీసుల పాపం పండింది. ఈ నెల 23వ తేదీన ఈ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించడానికి 20 నిమిషాల ముందు.. మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన గస్తీ పోలీసులు అక్కడికి వచ్చి.. తిరిగి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారు అక్కడికి ఎందుకు వచ్చి వెళ్లారనే అంశంపై ఆరా తీయడంతో ఈ కానిస్టేబుళ్ల బాగోతం బయటపడింది. దీనిపై శాఖాపరంగా విచారణ నిర్వహించగా.. కానిస్టేబుళ్లు, హోంగార్డుపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని తేలింది.