సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ గుర్తు తెలియని యువకుడు లైంగికదాడికి యత్నించగా తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైల్లో నుంచి బయటకు దూకి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ టీవీ నటిపై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈనెల 18న ఓ షాప్ ప్రారంభోత్సవానికి నగరానికి వచ్చిన ఆ నటి మాసబ్ ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలో బస చేశారు. 21న ఇద్దరు మహిళలు ఆమెను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తేవడంతో ఆమె వారితో గొడవ పెట్టుకుంది. ముగ్గురు వ్యక్తులు గది వద్దకు వచ్చి తమతో గడపాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. ఎదురుతిరిగిన ఆమెపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో క్రైమ్‌రేట్ పెరిగింది.
సంవత్సరకాలంగా నగరంలో జరుగుతున్న ఘటనలు చూస్తే నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరుగుతున్న ఘటనలు సిటీలోనే జరుగుతుండటం నేరస్తులు పోలీసులకు సవాల్ విసురుతున్నారా అని అనిపిస్తుంది. అతివల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ఒకవైపు సమర్థవంతంగా పనిచేస్తూ ఆకతాయిల ఆటకట్టిస్తున్నా.. వేధింపులు, లైంగికదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు ఎన్నిచట్టాలు రూపొందిస్తున్నా.. అతివలు, పిల్లలపై వేధింపులు, దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ అక్షరాస్యత ఎక్కువగా ఉందని చెప్పుకునే హైదరాబాద్‌లోనే వివిధ కేసుల నమోదు శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలోనే మూడొంతుల కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సగటున రోజుకు మూడు కేసులు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఈ కేసులు పెరగడానికి ప్రధానంగా నిఘా వైఫల్యమే కారణమని నగరవాసులు అంటున్నారు. ఎంఎంటీఎస్ ఘటనలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పెద్దగా నిఘా లేకపోవడం కారణమైతే.. చాలా ఘటనల్లో పోలీసులు అనుసరిస్తున్న ఉదాసీనత కారణంగా నేరస్తులు చెలరేగిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా పెట్రోలింగ్ వెహికిల్స్ ఎప్పటికప్పుడు తమ పరిధిలో జరుగుతున్న ఘటనలపై దృష్టి పెట్టకపోవడం, నిఘా వర్గాలు తమ ఏరియాల్లో జరిగే వ్యవహారాలను పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల్లో ఎక్కువగా బాధితులుగా ఉంటున్నది మహిళలే అని పోలీసులు ఆఫ్‌ద రికార్డుగా చెబుతున్నారు. ఆర్థికసమస్యలు, అక్రమసంబంధాలు, ప్రేమవివాహం.. కారణమేదైనా అతివలే సమిధలుగా మారుతున్నారు. ప్రధానంగా ఇంట్లోనే ఉండి ఉపాధి పొందుతూ ఆదాయాన్ని ఆర్జించండి అంటూ నేరస్తులు వారికి వల విసురుతున్నారు. మాయమాటలు చెప్పి బెదిరిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వారానికి ఒకరిద్దరు మహిళలు సైబర్‌నేరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా ఘటనలు బయటకు రాకపోవడానికి కూడా మహిళల మనస్తత్వాలే కారణమని వారు చెబుతున్నారు. చాలా ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనల్లో తాము కౌన్సెలింగ్ చేసినప్పుడు వారు చెప్పే విషయాలు విస్తుగొలుపుతున్నాయని వారు పేర్కొన్నారు. సమస్య మొదలైనప్పుడే బయటకు వస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో 50 శాతం మంది మౌనం వహిస్తున్నారని తెలుస్తుంది.