దుండిగల్, మే 27: దళితబంధు వాహనాలను లీజుకు తీసుకున్న ఓ డ్రైవర్.. యజమానులకు తెలియకుండా ఆ వాహనాలను విక్రయించి సొమ్ముచేసుకున్నాడు. నెలనెలా చెల్లించాల్సిన లీజు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు అతడు కనిపించకుండా పోయాడు. అనుమానించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందిడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడు విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం సూరారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ ఏసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆకుల వెంకటేశం వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన కనిగిరి శ్యాం (33) డ్రైవర్. గాజులరామారం డివిజన్ పరిధిలోని లాల్సాబ్గూడకు చెందిన మద్దెల కృష్ణ కూతురు మీనాను పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లిలో ఉంటున్నాడు. కాగా, లాల్సాబ్గూడకు చెందిన భిక్షపతి, మద్దెల యాదగిరి, దాసరి పోచమ్మ, బొడ్డు రమేశ్‌కు గత ప్రభుత్వం దళితబంధు పథకం క్రింద గూడ్స్ వెహికల్స్‌ను అందజేసింది.
వీటిపై కన్నేసిన శ్యాం.. లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.13,000ల చొప్పున చెల్లిస్తానని లీజుకు తీసుకున్నాడు. అప్పటికే గ్రామానికి చెందిన యువతిని పెండ్లి చేసుకోవడంతో వాహన యజమానులు అతడి మాటలను సులభంగా నమ్మి, తమ వాహనాలను లీజుకు ఇచ్చారు. ఆరు నెలల పాటు నెలనెలా అద్దె (లీజు) డబ్బులు చెల్లించిన శ్యాం.. ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం మానేశాడు. కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.
వాహనాలు సైతం కనిపించకపోవడంతో యజమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వాహనం యజమాని భిక్షపతి సూరారం పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కనిగిరి శ్యాంను అదుపులోకి తీసుకుని విచారించగా.. సదరు వాహనాలను యజమానులకు తెలియకుండా ఇతరులకు విక్రయించినట్లు తేలింది. ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్యాం విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ వాహనాలను కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు.