బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బతుకమ్మకుంట పేరుతో బోర్డులు పెట్టి, గ్రిల్స్ పెట్టి భూవివాదం ఉన్న చోట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించడంపై విమర్శలు వస్తుంటే చెరువుల పేరుతో పేదల ఇళ్లు కూలగొడ్తున్న హైడ్రాను కాపాడటానికి కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు ధర్నా రాజకీయం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి వీహెచ్‌కు బతుకమ్మకుంట విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి హైడ్రాను ప్రయోగించి వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. రూ.7.15కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిన హైడ్రా గ్రిల్స్, బోర్డులు ఏర్పాటు చేసింది. వీహెచ్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ చేసిన చర్యగా స్థానికులు చెబుతున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 28 ( నమస్తే తెలంగాణ )
బతుకమ్మకుంట పేరుతో అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బతుకమ్మకుంట పేరుతో బోర్డులు పెట్టి, గ్రిల్స్ పెట్టి భూవివాదం ఉన్న చోట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించడంపై విమర్శలు వస్తుంటే చెరువుల పేరుతో పేదల ఇళ్లు కూలగొడ్తున్న హైడ్రాను కాపాడడానికి కాంగ్రెస్ నేతలు ధర్నా రాజకీయం మొదలుపెట్టారు.

దేశసర్వోన్నతన్యాయస్థానం సైతం హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పును సమర్థించిన నేపథ్యంలో హైడ్రా చేసిన పనులను సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి స్వయంగా వీహెచ్‌కు బతుకమ్మకుంట విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి హైడ్రాను ప్రయోగించి వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తన స్థలంలో హైడ్రా చొరబాటును వ్యతిరేకిస్తూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం వివాదాస్పదంగా కోర్టులో ఉండగానే సుమారు రూ.7.15కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిన హైడ్రా పెద్ద ఎత్తున గ్రిల్స్, బోర్డులు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కోర్టు స్టేటస్కో మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉండగానే సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేయించింది. ఇది కేవలం వీహెచ్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం రేవంత్‌రెడ్డి హైడ్రాను వాడుకుని చేసిన చర్యగా అప్పట్లో బాగ్ అంబర్‌పేట వాసులు చెప్పారు. ఆ తర్వాత హైడ్రా చర్యలను కోర్టు తప్పుపట్టి తిరిగి యథాతథస్థితికి తీసుకురావాలని ఆదేశించినప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురు కావడంతో ఇక రాజకీయంగా ఈ వ్యవహారాన్ని హడావిడి చేయాలని భావించి వీహెచ్‌తో ఒక ధర్నా ప్లాన్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇచ్చిన తీర్పుకు ప్రతీఒక్కరూ కట్టుబడాల్సి ఉండగా వీహెచ్ మాత్రం తన ప్రాబల్యం కోసం రోడ్డెక్కారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. వీహెచ్‌తో రంగనాథ్ అంటకాగారంటూ వారిద్దరి మధ్య సామాజిక కోణం కూడా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, మరోవైపు వ్యక్తిగత పంతం కలిసి హైడ్రా కోర్టును సైతం లెక్కచేయలేదని, హైకోర్టు తీవ్రంగా మందలించిన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోకుండా కోర్టులో ఎన్నో అసత్య ప్రచారాలు చేసిందని బాగ్‌అంబర్‌పేట స్థానికులు చెబుతున్నారు.
హైకోర్టు మధ్యంతర స్టేటస్కో ఉత్తర్వులు అమలులో ఉండగానే వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది. నెలరోజుల్లోగా ధిక్కరణల పనులను తొలగించాలని ఆదేశించింది. దీనిపై రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే బోర్డులను, గ్రిల్స్‌ను తొలగించాలని చెప్పిన తర్వాత నెలరోజుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోని హైడ్రా గుట్టుచప్పుడు కాకుండా రెండురోజుల క్రితం రాత్రి పూట వచ్చి బతుకమ్మకుంట వద్ద హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డులో అక్షరాలు తొలగించారు. దీంతోపాటు సీఎం పేరుతో వేసిన శిలాఫలకాన్ని కూడా తీసేశారు. ఈ విషయమై స్థానికంగా ఉన్న గార్డును అడిగితే అవి గాలికిపోయాయని, తనకేమీ తెలియదంటూ వెళ్లిపోయారు.