సుల్తాన్‌బజార్/జగద్గిరిగుట్ట, నవంబర్ 17: సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సోమవారం పోలీసులు బందోబస్తుతో సుల్తాన్‌బజార్‌లోని రేఖాదేవికి చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సిటీ సివిల్ కోర్టు సిబ్బంది అక్కడికి వచ్చింది. అయితే తమ పూర్వీకుల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామని, నకిలీ డాక్యుమెంట్లతో తమ ఇంటిని ఆక్రమిస్తున్నారని రేఖదేవి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం సిబ్బంది ఇంటికి రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన రేఖదేవి.. ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇంటి గేటును ధ్వంసం చేసి రేఖాదేవిని అదుపులోకి తీసుకుని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇల్లును కూలుస్తారేమోనని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. భూదేవిహిల్స్ డీ బ్లాక్‌లో మనీషా(35) కుటుంబంతో కలిసి నివాసముంటుంది. రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు మనస్తాపం చెంది దోమల మందు తాగింది. బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నది.