
హిమాయత్‌నగర్, అక్టోబర్ 27 : పెళ్లి కావడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ల్యాబ్ టెక్నీషియన్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఓబులమ్మ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి ఉప్పల్, లక్ష్మీనారాయణ కాలనీలో ఉంటుంది. ఆమె కుమారుడు సి.నర్సింలు (38) హిమాయత్‌నగర్ వీధి నం 9లోని శ్రీ బాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్లో గత నాలుగేండ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
రోజు మాదిరిగానే మంగళవారం మధ్యాహ్నం ఉద్యోగానికి వచ్చిన నర్సింలు రాత్రి పదిగంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లి ఓబులమ్మ ఫోన్ చేయగా మరుసటి రోజు వస్తానని చెప్పాడు. కొంత కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో మానసికంగా కుంగిపోయిన నర్సింలు డయాగ్నోస్టిక్ సెంటర్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తోటి ఉద్యోగులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి తల్లి ఓబులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.