
బడంగ్‌పేట, అక్టోబర్ 12: వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేయించుకున్న బీజేపీ నాయకులు డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొంటూ ఓ కాంట్రాక్టర్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డబ్బులు ఎగవేతదారుల్లో ఉన్న బీజేపీ నాయకుల పేర్లతో కాంట్రాక్టర్ లేఖలు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన సైదులు (45) వెంచర్ అభివృద్ధి పనులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుని చేస్తుంటాడు.
ఓ వెంచర్ పనులు పూర్తయినా అందుకు సంబంధించిన కోటి రూపాయలకు పైగా డబ్బులు యజమానులు ఇవ్వకపోవడంతో సూసైడ్ నోట్స్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో రవీందర్‌రెడ్డి, చంపాపేట బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, హేమంత్‌రెడ్డి, దర్గేశ్, సురేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మహేందర్, శ్రీశైలం పేర్లు ఉన్నాయి. వీరంతా సుమారు కోటి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉందని పేర్కొంటూ వారి పేర్లతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సైదులుకు భార్య వసంత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు సూసైడ్ నోట్స్ ఉన్నాయని, నాయకులుకూడా ఉన్నారని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.