
చార్మినార్, అక్టోబర్ 2 : అప్పటికే ఇద్దరు కూతుళ్లు పుట్టారు.. మళ్లీ గర్భం దాల్చగా.. ఆడపిల్ల పుడుతుందని భార్యను అత్తగారింటికి పంపించిన భర్త..ఆపై నిత్యం ఫోన్లు చేసి..వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కామాటిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కామాటిపురలో ఉండే ఆమేర్‌కు ముర్గీచౌక్ ప్రాంతానికి చెందిన రుబీనా (22)తో మూడున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు సంతానం. ప్రస్తుతం రుబీనా నాలుగు నెలల గర్భిణి. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని ద్వేషం పెంచుకున్న ఆమేర్ భార్యను పుట్టింటికి పంపించాడు.
బాబు పుడితేనే తిరిగి తన వద్దకు రావాలంటూ.. ఆదేశించిన ఆమేర్.. ప్రతి రోజూ రుబీనాకు ఫోన్ చేసి వేధించాడు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలకు జన్మించినందుకు నెల వారీగా అత్తమామలు చెల్లిస్తున్న దానికి అదనంగా చెల్లించాలంటూ హుకుం జారీ చేశాడు. ఆమేర్ వేధింపులు రోజు రోజుకు అధికమవ్వడంతో మనస్తాపం చెందిన రుబీనా శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపారు.