
కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 12 :కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ కృష్ణప్ప చంద్రశేఖర్(50), అనురాధ దంపతులు మెదక్‌లో నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తమ కుమారుడు నీట్ పరీక్ష కోసం చంద్రశేఖర్ దంపతులు నగరానికి వచ్చారు. నిజాంపేటలో పరీక్ష కేంద్రంలో కుమారుడిని వదిలిపెట్టిన తర్వాత అనురాధ మెదక్‌కు వెళ్లిపోయింది. చంద్రశేఖర్ మాత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్లో బస చేశాడు. వచ్చేటప్పుడు తన వెంట నిద్ర మాత్రలతో పాటు తాడును తెచ్చుకున్నాడు. భార్య అనురాధ భర్తకు అనేకసార్లు ఫోన్ చేసినా.. స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి ఫోన్ చేసింది. వారు గది వద్దకు వెళ్లి చూడగా, లాక్ చేసి ఉన్నది.
ఎంత ప్రయత్నించినా.. డోర్ తీయకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు డోర్ తెరిచేసరికి చంద్రశేఖర్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగలపర్తి గ్రామ శివారులో కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో చంద్రశేఖర్ ప్రమేయమున్నట్లు మృతుడి బంధువులు ఆరోపించినట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించిన అక్కడి పోలీసులు.. చంద్రశేఖర్ ప్రమేయంపై ఇటీవలే అతడిని విచారించినట్లు తెలిసింది.