
వెంగళరావునగర్, ఆగస్టు 23 : ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. కాని వారి పెండ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. మరొకరితో నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలుసుకున్న ప్రియుడు సైనెడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కె.నీరజ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మధురానగర్ కాలనీలోని విష్ణు క్లాసిక్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. నీరజ్ కుమారుడు విశాల్(26) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 12గంటల సమయంలో ఉదయం త్వరగా లేవాలని.. తల్లిదండ్రులకు చెప్పి తన గదిలోకి వెళ్లాడు. సోమవారం తెల్లవారు జామున తండ్రి నీరజ్ కుమారుడి గదిలోకి వెళ్లాడు. విశాల్ అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
విశాల్ గదిలో సుసైడ్ నోట్ లభించింది. నీళ్ల సీసాలో సైనెడ్ ఉంది. ఎవరూ ముట్టుకోకండి.. నన్ను క్షమించండి అని రాసి ఉన్నది. తరువాత విశాల్ సెల్ఫోన్లో 40 నిమిషాల నిడివి గల సెల్ఫీ వీడియోను గుర్తించారు. ఓ యువతిని గత 7ఏండ్లుగా ప్రేమించానని, తనను పెండ్లి చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, వేరొకరితో నిశ్చితార్థం చేశారని పేర్కొన్నాడు. ప్రేమించిన యువతి లేకుండా తాను బతకలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.