హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : టీచర్స్ డే రాష్ట్రస్థాయి వేడుకల వేదికను సర్కార్ అనూహ్యంగా మార్చింది. హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు తరలించింది. అవార్డుల ప్రదానోత్సవానికి ఒక రోజు ముందుగా వేదికను మార్చడంతో గందరగోళం నెలకొన్నది. ప్రతి సంవత్సరం విద్యాశాఖ గురుపూజోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. నిరుడు వేదికను మాదాపూర్‌లోని శిల్పకళావేదికకు మార్చారు. ఈ ఏడాది ఏకంగా కొడంగల్ జూనియర్ కాలేజీ మైదానానికి మార్చారు. వాస్తవానికి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించాలని అధికారులు భావించారు. రూ. 70లక్షలతో భవన్‌ను ఆధునీకరించారు. శుక్రవారం అనూహ్యంగా కొడంగల్‌కు మార్చారు. ఈ సారి 123 మందికి అవార్డులు అందజేయనుండగా, వీరంతా కొడంగల్‌కు చేరుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
టీచర్ల అసంతృప్తి
వేదికను కొడంగల్‌కు మార్చడంపై టీచర్లు, టీచర్ల సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ‘మొదట్లో టీచర్లను తమతో సమానంగా వేదిక మీద కూర్చొబెట్టారు. ఆ తర్వాత వీఐపీ గ్యాలరీకి మార్చారు. ఇప్పుడు ఏకంగా గ్రౌండ్లో ప్రేక్షకుల స్థాయికి దిగజార్చారు’ అంటూ ఓ ఉపాధ్యాయ సంఘం నేత వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అవార్డు గ్రహీతలు కొడంగల్‌కు, అక్కడి నుంచి మళ్లీ ఇండ్లకు చేరుకోవాలంటే రెండు, మూడు రోజులు ప్రయాణించాల్సి వస్తున్నదని మరో నేత వాపోయారు.