Suman | కందుకూరు, మార్చి 28 : విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని సినీ నటుడు సుమన్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని హైదరాబాద్ టెక్నో స్కూల్ 14వ వార్షికోత్సవంలో పాల్గొని కరస్పాండెంట్ రఘురాం రెడ్డి, ప్రిన్సిపాల్ కవిత లక్ష్మీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. విద్యార్థులు సన్మార్గంలో పయనించాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని అన్నారు. ప్రాథమిక విద్యనే పునాది రాయి అని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని సూచించారు. హైదరాబాద్ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత లక్ష్మి, రంగారెడ్డి జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, కోశాధికారి మహేందర్ రావు, నోబుల్ హైస్కూల్ కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి , మహేందర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.