హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): గౌలిదొడ్డి సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కళాశాలను యథావిధిగా కొనసాగించాలని, మెరిట్ ప్రాతిపదికన విద్యార్థుల తరలింపును తక్షణమే నిలిపేయాలని కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశమయ్యే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ సంక్షేమ భవన్లో సొసైటీ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా సీవోఈ కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో అందజేసే నీట్, జేఈఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించి, అందులో మెరిట్ సాధించిన విద్యార్థులకే అడ్మిషన్ కల్పించారని వివరించారు. కానీ ఈ ఏడాది సొసైటీ సెక్రటరీ రాష్ట్రంలో ఎకడా లేని విధంగా ఎంపీసీని ఒక దగ్గర, బైపీసీని ఒక దగ్గర వేర్వేరుగా ఏర్పాటు చేశారని తెలిపారు. అదిగాక రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ద్వారా వచ్చిన విద్యార్థులను, ప్రస్తుతం ఇంటర్లో 90శాతం మెరిట్ సాధించలేదని చెబుతూ ఇప్పుడు వేరొక కళాశాలకు బదిలీ చేస్తున్నారని వాపోయారు. మారు లు తకువ వచ్చాయనే నెపంతో ఇతర కళాశాలలకు విద్యార్థులను పంపి వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని వివరించారు.
మెరిట్ సాధించిన వారంతా నీట్, జేఈఈ ర్యాంకులను సాధిస్తారని, ఇంటర్ మెరిట్ రాని వారు ర్యాంకులు సాధించలేరనేది అవివేకమైన ఆలోచనని వివరించారు. ఈ అంశాలపై 20 రోజులుగా సీఎం, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవోతోపాటు, అసెంబ్లీ స్పీకర్‌కు సైతం విన్నవించామని, అయినా పట్టించుకున్నవారే లేకుండా పోయారని గౌలిదొడ్డి కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆమరణ నిరాహార దీక్షకు కొనసాగిస్తామని, ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వం, గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి వహించాలని హెచ్చరించారు.