ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8 : తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం త్వరితగతిన కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంపస్‌లోని సరస్వతీ ఆలయంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. ప్రజలు మార్పు కోరారు కానీ కేసీఆర్‌ను దూరం చేసుకోలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా కేసీఆర్‌కు రక్షగా ఉంటాయని అన్నారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకులు హేళన చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొండ గణేశ్, డాక్టర్ ఇనుగుర్తి శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మణికంఠ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.