దుండిగల్, జూలై 7: భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని అంతరిక్ష రంగంలో రాణించాలని ఎన్ఆర్ఎస్ఈ, ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ డా.ఎంవీ.రవికుమార్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ) కళాశాలలోని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చాప్టర్ ‘ఐట్రిపుల్ఈ’ సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం భారతదేశ అంతరిక్ష రంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఇస్రో వంటి సంస్థలు అభివృద్ధిపరిచిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే నేడు సామాన్య ప్రజలు సైతం గూగుల్ మ్యాప్స్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోగల్గుతున్నారన్నారు. తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘భువన్’ స్పేషియల్ వేదికతో పలు ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన దీని వలన రైతాంగానికి సైతం మేలు జరుగుతుందన్నారు. జీడిమెట్లలోని తమ సంస్థ ప్రాంగణంలో నవకల్పనలు, అంకుర సంస్థలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, స్పేస్ ఆన్ వీల్స్ పేరిట ఇస్రో బస్సులో ఏర్పాటు చేసిన సంచార వైజ్ఞాన ప్రదర్శన విద్యార్థులను, అధ్యాపకులను విశేషంగా ఆకట్టుకున్నది. కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకులు ఆచార్య డా.సీడీ.నాయుడు, సంచాలకులు డా.బీ.చెన్నకేశవరావు, విద్యార్థి పురోగతి డీన్ డా.వై.పద్మశాయి, సీఎస్ఈ విభాగాధిపతి డా.ఎస్.నాగిణి, కళాశాల అనుబంధ అధ్యాపకుడు డా.రవి సదాశివుని, ఇస్రో ప్రతినిధులు డా.ఆర్ శ్రీనివాస్, డా.పీ.హరీశ్, డా.పి.మంజుశ్రీ, సవిత తదితరులతోపాటు వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సమీపంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.