జూబ్లీహిల్స్, ఏప్రిల్ 15 : కార్మికనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా క్లాస్‌రూమ్‌లు లేకపోవడంతో చిన్నారులు బాల్కానీలో కూర్చుని చదువుకుంటున్నారు. వర్షం వస్తే ఈ అదనపు సౌకర్యం (ప్రివిలేజ్) కూడా లేకుండా పోవడంతో క్లాస్‌రూమ్‌లు కిక్కిరిసిపోతున్నాయి. స్థానిక కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న జీపీఎస్, కార్మిక నగర్లో 1 నుంచి 5 తరగతుల్లో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అయితే ప్రతి ఏడాది కనీసం 100 మంది విద్యార్థులుండే ఈ పాఠశాలకు కేవలం 2 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో చిన్నారులు వరండాలో కూర్చుని విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. టీచర్లకు కూడా ప్రత్యేకంగా స్టాఫ్ రూం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు క్లాస్ రూమ్‌లలోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరొక టీచర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉండడం గమనార్హం. బస్తీలో ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదులు లేకపోవడంతో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా.. స్థానిక అంగన్వాడీ విద్యార్థులు తప్ప.. కొత్తగా చేరేవారు కరువయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఈ పాఠశాలలో క్రమంగా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.