కాప్రా, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, బీఈడీ తదితర కోర్సులకు సంబంధించి రూ.7700 కోట్ల బోధనా రుసుములు, ఉపకార వేతనముల బకాయీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులు జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ అంబేద్కర్ చౌరస్తా వరకు సుమారు 400ల మంది బాధిత విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అదే పథకానికి తూట్లు పొడుస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలన్నారు. మూడేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బోధనా రుసుములు, ఫీజు బకాయీలు, ఉపకార వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, శేఖర్, కార్యవర్గ సభ్యులు మహేష్, సొహైల్, అజీమ్ పాషా, ఆర్తి, ఆస్మా, దేవి, సంధ్య, నీలిమ, కీర్తన, నయన, స్వాతి, మంజులత పాల్గొన్నారు.