కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 17 : ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బలరామ్‌నాయక్ కుమారుడు శ్రీకేతన్ (16) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ.. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లిన శ్రీకేతన్ కిటికీకి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తొటి విద్యార్థులు హాస్టల్, కాలేజీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని రాత్రికి రాత్రే గాంధీ మార్చురీకి తరలించారు.
విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
శ్రీకేతన్ మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు బుధవారం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతూ పలుకడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీలో విద్యార్థిని చేర్చిన సమయంలో మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే హాస్టల్లో ఉంటారని చెప్పారని, తర్వాత సెకండ్ ఇయర్ విద్యార్థులను వారితో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌తోనే తన కొడుకు చనిపోయాడన్నారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేపీహెచ్‌బీ కాలనీ సీఐ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా… విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.