కాచిగూడ, జనవరి 17: తెలంగాణలో నిర్వహించే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ మేధావుల సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్.కృష్ణయ్య, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఏఐసీసీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం పెంచాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, చట్టం చేసి ఎన్నికలకు వెళ్లాని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని, రానున్న కాలం బీసీల రాజ్యమేనని వెల్లడించారు. బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం అత్యంత బలంగా ఉందని, అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ, దేశంలో అధిక శాతం బీసీలు ఉన్నారని, ఐనప్పటికీ బానిసలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలు రాజ్యాధికార దిశగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీలు ఓటర్లుగా కాకుండా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం వచ్చినప్పడే బీసీల బతుకులు మారుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో గొరిగ మల్లేశ్, నీలం వెంకటేశ్, రాజేందర్, వేముల రామకృష్ణ, నందగోపాల్, అనంతయ్య, పి.శ్రీనివాస్ నాయి, రామ్‌దేవ్ మోదీ, జయంతి గౌడ్, రమాదేవి, భాగ్యలక్ష్మితో పాటు మేధావులు, అఖిల పక్ష ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలు, మహిళా, యువజన, విద్యార్థి నేతలు పాల్గొన్నారు.