సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : రైల్వే ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీలో నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో గురువారం డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైళ్లలో, రైల్వే ట్రాక్‌లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, ఖాళీల భర్తీ, ప్రయాణీకుల వస్తువుల చోరీని అరికట్టేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్, రైలు ప్రమాదాల నివారణ చర్యలు, కదులుతున్న రైళ్లలో చోరీపై షార్ట్ ఫిల్మ్ రూపొందించాలని నిర్ణయించారు. ఇక జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీసీ కెమెరాల సమన్వయంతో తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని నిర్ణయించారు.
ఐఆర్సీటీసీ అనుమతి లేకుండా ఆన్ లైన్లో టికెట్ బుకింగ్ చేసే మోసగాళ్లపై చర్యలు, రైల్వే ట్రాక్‌లు, ప్లాట్ ఫారమ్‌ల వద్ద మరణించిన వ్యక్తుల గణాంకాల ప్రకటన, బచ్పన్ బచావో ఆందోళన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో.. రైల్వే ఏడీజీ బి శివధర్‌రెడ్డి, ఏడీఎల్ డీజీపీ ఎల్ అండ్ వో, సంజయ్‌కుమార్ జైన్, ఐజీ పీసీఎస్సీ, ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ రాజారామ్, ఐఆర్ పీఎఫ్ఎస్ ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, డీడీ ఐటీ ఎస్ తిరుజ్ఞాన సంబంధన్, డీఐజీ పీ అండ్ ఎల్ ఎం రమేశ్, ఎస్ఆర్పీ సికింద్రాబాద్ దేబాష్మిత బెనర్జీ పాల్గొన్నారు.
రైల్వే సమాచారం మరింత సులభం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సమాచార విశ్లేషణ కేంద్రాన్ని గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ప్రారంభించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సమాచార విశ్లేషణ విభాగంలో భారతీయ రైల్వేలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి దీనిని ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్ఐఎస్ మేనేజింగ్ డైరెక్టర్ డీకే సింగ్, సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ రవి, ఎస్సీఆర్కు చెందిన పలు విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.