సుల్తాన్ బజార్, జూన్ 11: ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా కొరడా ఝుళిపించారు. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 అధికారులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయించారు. బ్యాంక్ స్ట్రీట్, గోకుల్‌చాట్ లేన్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్డు, జైన్ మందిర్ లేన్‌లో ఫుట్‌పాత్‌లను, రోడ్లను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించారు.
ఈ సందర్భంగా ఫుట్‌పాత్ వ్యాపారులకు ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్‌కుమార్ పలు సూచనలు చేశారు. పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఫుట్‌పాత్ వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి సొంత వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.