సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, అధికారులతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు హరీశ్, అమోయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు టీమ్ వర్క్‌తో సమష్టిగా కలిసి పనిచేయాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని సకాలంలో గుర్తించి, కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా సోషల్ మీడియా బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఎన్నికలను ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలో వివరించారు. అనంతరం సైబరాబాద్ క్రైమ్ డీసీపీ సింగేన్వార్ కల్మేశ్వర్ ఎన్నికల నిర్వహణలో వల్నరెబిలిటి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.